టీ-20 లకు గుడ్ బై చెప్పనున్న మిథాలీ

వాస్తవం ప్రతినిధి: టీమ్‌ఇండియా మహిళల వన్డే సారథి, సీనియర్‌ క్రీడాకారిణి మిథాలీ రాజ్‌ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో సిరీస్‌ అనంతరం పొట్టి క్రికెట్‌ నుంచి మిథాలీ తప్పుకోనున్నట్లు సమాచారం. టీ20 క్రికెట్‌కు దూరమైనా.. 36 ఏళ్ల మిథాలీ వన్డేల్లో కొనసాగుతుంది. మరోవైపు బుధవారం వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభంకానుండగా.. తుదిజట్టులో మిథాలీ ఉంటుందా అన్నదానిపై స్పష్టత లేదు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు మిథాలీని ఎంపిక చేసినా.. 3 మ్యాచ్‌ల్లో తను ఆడేదీ అనుమానమే! ‘‘2020 టీ20 ప్రపంచ కప్‌కు హర్మన్‌ప్రీత్‌ జట్టును సిద్ధం చేసుకుంటుందన్న సంగతి మిథాలీ అర్థం చేసుకోగలదు. ఆ టోర్నీలో ఆమె ఆడకపోవచ్చు. ఐతే మిథాలీ వంటి దిగ్గజ క్రీడాకారిణికి ఘనంగా వీడ్కోలు పలకాలి’’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ తుది జట్టులో మిథాలీని చేర్చకపోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఓడింది.