విండీస్ కెప్టెన్ పై ఐసీసీ కొరడా

వాస్తవం ప్రతినిధి: వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌పై ఐసీసీ కొరఢా ఝులిపించినట్లు తెలుస్తుంది. స్లో ఓవర్ రేట్ ఉన్న కారణంగా అతడిపై ఒక టెస్టు మ్యాచ్‌ నిషేధం విధించింది. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో వెస్టిండీస్‌ బౌలర్ల స్లో ఓవర్‌ రేట్ నమోదు అవ్వడం తో హోల్డర్ పై ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గత ఏడాది జూన్‌లో శ్రీలంకతో టెస్టు మ్యాచ్‌లోనూ హోల్డర్‌ నాయకత్వంలోని విండీస్‌ జట్టు నెమ్మదిగా బౌలింగ్‌ చేసింది. దీంతో హోల్డర్‌ను ఐసీసీ రిఫరీ జెఫ్‌ క్రో అతడిపై ఒక టెస్టు మ్యాచ్‌ నిషేధం విధించాడు. ఐతే హోల్డర్‌ విషయంలో ఐసీసీ మరీ కఠినంగా వ్యవహరించిందంటూ మాజీలు విమర్శలు గుప్పించారు. ఇంగ్లాండ్‌ ఘోర పరాజయం పాలైన ఈ మ్యాచ్‌ మూడు రోజులే సాగిందని.. విండీస్‌ నలుగురు ఫాస్ట్‌బౌలర్లతో బౌలింగ్‌ చేయించిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఉండాల్సిందని స్పిన్‌ దిగ్గజ షేన్‌ వార్న్‌ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాళ్లు అథర్టన్‌, మైకేల్‌ వాన్‌ సైతం ఐసీసీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇంగ్లాండ్‌పై వరుసగా రెండు టెస్టుల్లో ఘనవిజయం సాధించిన విండీస్‌.. మూడో టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా ట్రోఫీని అందుకోబోతున్న సమయంలో హోల్డర్‌ను దూరం పెట్టడం అన్యాయమని వారంతా అభిప్రాయపడ్డారు.