“కావాలనే ఆ నిర్ణయం తీసుకున్నా “: రోహిత్

వాస్తవం ప్రతినిధి: న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో పేసర్లకు అనుకూలించే పిచ్‌పై భారత తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ నిర్ణయం కావాలనే తీసుకున్నానని రోహిత్ మ్యాచ్ అనంతరం మీడియా తో మాట్లాడుతూ తెలిపాడు. నాలుగో వన్డేలో 92కే కుప్పకూలిన నేపథ్యంలో మరోసారి తమను తామను పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో బ్యాటింగ్‌ ఎంచుకున్నట్లు రోహిత్‌ చెప్పాడు. ‘‘టాస్‌కు ముందు పిచ్‌ను పరిశీలించా. ఆరంభంలో బౌలర్లకు అనుకూలిస్తుందని నాకు తెలుసు. కానీ మమ్మల్ని మేం పరీక్షించుకోవాలనుకున్నాం. ఎందుకంటే ప్రపంచకప్‌లో మాకు ఇలాంటి పరిస్థితులే ఎదురుకావొచ్చు. మేం త్వరత్వరగా నాలుగు వికెట్లు చేజార్చుకున్న మాట నిజమే. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు, బంతి స్వింగవుతున్నప్పుడు ఎలా బ్యాటింగ్‌ చేయాలో నేర్చుకున్నాం. మాకిప్పుడు అలాంటి స్థితిలో ఏం చేయాలో తెలుసు. మొదటి 30 ఓవర్లలో రన్‌రేట్‌ గొప్పగా లేదు. అయినా మేం 250 దాటాం. అది పెద్ద సానుకూలాంశం’’ అని రోహిత్ తెలిపారు. న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో భారత్ 4-1 తో సిరీస్ ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం కివీస్ జట్టుతోనే భారత్ టీ-20 సిరీస్ ఆడబోతుంది.