కొనసాగుతున్న దీక్ష….ప్రాణాలైనా ఇస్తా కానీ రాజీపడే ప్రసక్తే లేదు!

వాస్తవం ప్రతినిధి: సీబీఐ అధికారుల తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సత్యాగ్రహ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ దీక్ష మంగళవారం కూడా కొనసాగుతుంది. మరోపక్క దీదీ చేపట్టిన దీక్ష కు ప్రతిపక్ష పార్టీలు కూడా భారీగా తమ మద్దతు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం కూడా టీఎంసి నేత,బెంగాళీ నటి ఇంద్రాణీ హల్దార్ కూడా మమతను కలిసి ఈ ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ నేపధ్యంలో  ధర్నా వేదిక వద్ద ఉన్న టీఎంసీ నేతలను ఉద్దేశిస్తూ మమతాబెనర్జీ ప్రసంగిస్తూ కేంద్రప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ‘నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వారినే ఈ రోజు మీరు(కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) దొంగలంటున్నారు. నన్ను, రాజీవ్‌కుమార్‌ను దొంగ అంటున్నారు. మేం ఎవరి సొమ్ము తీసుకుని పారిపోయాం? ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఓ నిజాయతీపరుడిని పట్టుకుని మోసగాడు అంటే నేను చూస్తూ ఊరుకోను. వారికి అండగా నిలుస్తా. అందుకోసం నా ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా సరే అందుకు నేను సిద్ధంగా ఉన్నా. అంతేగానీ రాజీపడే ప్రసక్తే లేదు’ అని మమత స్పష్టం చేశారు. శారద కుంభకోణం కేసుకు సంబంధించి పోలీస్ కమీషనర్ రాజీవ కుమార్ పై సీబీఐ సోదాలు నిర్వహించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ అధికారులను అరెస్ట్ చేయడం తో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.