డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు మరో శుభవార్త!

వాస్తవం ప్రతినిధి: ఆంద్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా లోటుబడ్జెట్‌లో ఉన్నా మహిళలను ఆదుకునేందుకు సర్కారు సిద్ధమైంది.  ఆడపడుచులు ఆనందంగా ఉండాలన్నదే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన 50 నెలల్లోనే చంద్రన్న పసుపు, కుంకుమ పథకం ద్వారా ఆర్థికంగా మహిళలకు చేయూతనివ్వడం ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు. డ్వాక్రా గ్రూపుల్లోని ప్రతి మహిళకు మరోసారి పసుపు, కుంకుమ పథకం కింద పదివేల రూపాయలు చెల్లించడానికి ఏపీ సర్కారు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ఈ పథకాన్ని మూడు దశల్లో అమలు చేయనుంది. రాష్ట్ర రాజధాని అమరావతితోపాటు కడప, విశాఖ జిల్లాల్లో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు సంఘం సభ్యులు 95 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ 10 వేల మొత్తాన్ని మూడు విడతల్లో చెక్కుల రూపంలో అందజేయనున్నారు. తొలి విడత ఫిబ్రవరి 1న రెండున్నర వేలు, రెండో విడత మార్చి 8న మూడున్నర వేలు, ఏప్రిల్ 5న మూడో విడతగా నాలుగు వేలు అందజేస్తారు. ఈ మేరకు వడ్డీ రాయితీతో కలిపి 11వేల 118 కోట్ల మొత్తాన్ని స్వయం సహాయక సంఘాల ఖాతాలో జమ చేశారు.