రాజీనామా చేసిన గ్రీక్ రక్షణ మంత్రి

వాస్తవం ప్రతినిధి: గ్రీక్ రక్షణ మంత్రి పనోస్ కమెనోస్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. మాసిడోనియా పేరు మార్పిడి వివాదంలో ప్రభుత్వ వైఖరితో తీవ్రంగా విభేదించిన ఆయన ఆదివారం తన రాజీనామా ను అందించారు. కమెనోస్‌ రాజీనామా అనంతరం ప్రధాని సిప్రాస్‌ మాట్లాడుతూ వచ్చేవారం ఈ ప్రభుత్వంపై పార్లమెంట్‌లో విశ్వాస ఓటు కోరతానని చెప్పారు. ప్రధాని అలెక్సిస్‌ సిప్రాస్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతునిస్తున్న గ్రీక్స్‌ పార్టీకి సారధ్యం వహిస్తున్న కమెనోస్‌ మాసిడోనియా పేరు మార్పిడి ఒప్పందాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తూనే వున్నారు. ఆదివారం ఉదయం ప్రధాని సిప్రాస్‌తో భేటీ అయిన కమెనోస్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాసిడోనియా పేరు మార్పిడి వ్యవహారం తనను మంత్రిపదవిలో నిలవనివ్వటం లేదన్నారు. తమ పార్టీకి చెందిన మరో ఆరుగురు మంత్రులను కూడా ప్రభుత్వం నుండి ఉపసంహరించు కుంటామని ఆయన చెప్పారు. రక్షణ మంత్రి రాజీనామా ప్రభావం సిప్రాస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎటువంటి ప్రభావం చూపుతుందన్న అంశంపై స్పష్టత రాలేదు. రానున్న అక్టోబర్‌లో గ్రీస్‌ పార్లమెంట్‌కు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సంకీర్ణ కూటమిలో విబేదాలు రచ్చకెక్కటం గమనార్హం. 300 మంది సభ్యు లున్న పార్లమెంట్‌లో సిప్రాస్‌ సంకీర్ణ కూటమికి 153 స్థానాల బలం వుంది. అందులో 145 మంది సిప్రాస్‌ నేతృత్వంలోని సిరిజా పార్టీకి చెందిన వారేనన్న విషయం తెలిసిందే.