థాక్రే ఇంట పెళ్లి సందడి….కానీ మోదీ ఇంకా అందని ఆహ్వానం!

వాస్తవం ప్రతినిధి: మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌ష్ట్ర) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈ నెలాఖరులో ఆయన కుమారుడి వివాహం జరగనుంది. అయితే ఈ  శుభకార్యానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి ఇంకా వివాహ ఆహ్వానం అందకపోవడం గమనార్హం. ఈ శుభ కార్యానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ లాంటి ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు రాజ్‌ ఠాక్రే గతవారం ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఆగిపోయారు. దీంతో తన అత్యంత సన్నిహతులైన హర్షల్‌ దేశ్‌పాండే, మనోజ్‌ హతేకు ఆహ్వాన బాధ్యతలు అప్పగించారు. గతవారం వీరిద్దరూ ఢిల్లీ వెళ్లి పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ, ప్రకాశ్‌ జావడేకర్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, మేనకా గాంధీ, భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ తదితరులను ఆహ్వానించారు. అయితే అతిథుల జాబితాలో ప్రధాని మోదీ పేరు లేనట్లు తెలుస్తోంది. రాజ్‌ఠాక్రే కుమారుడి వివాహానికి మోదీకి ఇంకా ఆహ్వానం అందలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ మధ్య ఠాక్రే కూడా ఈ విషయంపై మీడియా ఎదుట ప్రస్తావించారు. కుమారుడి వివాహానికి ప్రధానిని ఆహ్వానిస్తారా అని అప్పట్లో మీడియా రాజ్‌ఠాక్రేను ప్రశ్నించగా.. ‘పెళ్లి అనే బంధాన్ని మోదీ నమ్ముతారా?’ అంటూ బదులిచ్చారు. దీంతో ప్రధాని మోదీని రాజ్‌ఠాక్రే ఆహ్వానిస్తారా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. అయితే అనుకున్నట్లుగానే అతిధుల జాబితా లో మోదీపేరు లేనట్లు తెలుస్తుంది.