ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా దళాలు

వాస్తవం ప్రతినిధి: భారత భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలుస్తుంది. కరడుగట్టిన ఉగ్రవాది సహా మరో ఉగ్రవాదిని ఆదివారం భద్రతా దళాలు హతమార్చాయి. వీరిలో అల్‌-బదర్‌ ఉగ్ర సంస్థకు చెందిన ఏ++ కేటగిరీ ఉగ్రవాది జీనత్‌-ఉల్‌-ఇస్లామ్‌ ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. అతని తో పాటు షకీల్‌ దార్‌ అనే ఉగ్రవాది కూడా హతమైనట్లు తెలుస్తుంది. అతడు కూడా గతంలో అనేక ఉగ్ర నేరాలకు పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. వీరు 2015 నుంచి ఈ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అల్‌-బదర్‌ సంస్థను బలోపేతం చేసేందుకు గతేడాది నవంబరులో ఉగ్రవాది జీనత్‌-ఉల్‌-ఇస్లామ్‌.. హిజ్బుల్‌ ముజాహిదిన్‌ నుంచి ఈ సంస్థలో చేరాడని పోలీసులు వివరించారు. ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాగి ఉన్నారని అందిన సమాచారం మేరకు శనివారం సాయంత్రం కుప్వారా జిల్లా యారిపోరాలోని కత్‌పోరా ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా దళాల పై కాల్పులు జరపడం తో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే నిబంధనల ప్రకారం వారికి లొంగిపోయేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వారు కాల్పులు కొనసాగించడం తో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపి వారిని మట్టుబెట్టినట్లు తెలుస్తుంది.