తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: పేదల కళ్లలో వెలుగే నిజమైన సంక్రాంతి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది పింఛన్ పెంపు పేదలకు పెద్ద కానుక అని చంద్రబాబు తెలిపారు. తెలుగు ప్రజలకు ఆయన భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. జన్మభూమి కార్యక్రమంలో తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని పేర్కొన్నారు. పారదర్శకంగా, నిస్వార్థంగా పనిచేయడం వల్లే జన్మభూమి కార్యక్రమంలో గొడవ చేయాలని కొందరు యత్నించినా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.
మరోవైపు కుటుంబీకులు, ఆత్మీయుల మధ్య స్వగ్రామంలో సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రానున్నట్లు కలెక్టర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నారావారిపల్లెకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. సంక్రాంతి వేడుకలను కుటుంబీకుల నడుమ జరుపుకుంటారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు నారావారిపల్లె నుంచి బయలుదేరి విజయవాడకు వెళతారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో శనివారం కలెక్టర్‌ ప్రద్యుమ్న, తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌, తిరుపతి కమిషనర్‌ విజయ్‌రామరాజు, ఇతర అధికారులు హెరిటేజ్‌ ఫ్యాక్టరీని, నారావారిపల్లెలో ఏర్పాట్లను పరిశీలించారు.