అలోక్ అవినీతికి పాల్పడ్డారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు: మాజీ జస్టీస్

వాస్తవం ప్రతినిధి: సీబీఐ మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ అవినీతికి పాల్పడ్డారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ స్పష్టం చేశారు. అలోక్ పై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) విచారణను సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన పట్నాయక్ శనివారం మీడియా ముందు ఈ విషయాన్నీ వెల్లడించారు. కేవలం సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా చేసిన ఆరోపణ లపైనే అలోక్‌ వర్మపై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ దర్యాప్తు జరిపి సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించిందని, ఆ నివేదికలోని అంశాలకు తనకు ఎంత మాత్రం సంబంధం లేదని పట్నాయక్‌ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను లిఖిత పూర్వకంగా సుప్రీం కోర్టుకు తెలియజేశానని చెప్పారు. అంతేకాకుండా అలోక్ వర్మ పై సీవీసీ విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా కూడా అలోక్‌ వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని శుక్రవారం ఏఎన్‌ఐ వార్తా సంస్థతో వ్యాఖ్యానించడం మరింత షాకింగ్‌ న్యూస్‌. అలోక్‌ వర్మపై వేటు గురించి ఆయన మాట్లాడుతూ సీబీఐపై రాజకీయ పెత్తనం కొనసాగినంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.