రజత్ పై కేంద్ర ఎన్నికల సంఘం కు ఫిర్యాదు చేస్తాం: కొదండరామ్

వాస్తవం ప్రతినిధి: తెలంగాణా రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ పై కేంద్ర ఎన్నికల సంఘం కు ఫిర్యాదు చేస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్‌ అన్నారు. ఎన్నికల కమిషన్‌ నిస్వార్థంగా విధులు నిర్వహించడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. శాసనసభ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని, కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు.  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌పై పలు అనుమానాలు ఉన్నాయని, ఆయన్ను పార్లమెంట్‌ ఎన్నికల వరకు కొనసాగించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని శనివారం మీడియాతో వెల్లడించారు. అలానే  గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెజస పోటీచేస్తుందని స్పష్టం చేశారు. నేడు పార్టీలకు, రాజకీయ నాయకులకు సిద్ధాంతపరమైన విధానాలు లేవని, స్వార్థప్రయోజనాల కోసం బట్టలు మార్చినంత సులభంగా పార్టీలు మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు నిధులు, విధులు కేటాయించి బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.