అధ్యక్ష ఎన్నికల బరిలో తులసి గబ్బార్డ్

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు,కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్ బరిలోకి దిగుతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో ఆమె అధ్యక్ష ఎన్నికల పోటీకి సిద్ధంగా ఉన్నానని తులసి గబ్బార్డ్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మరో వారం రోజుల్లో అధికారిక‍ ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. ‘వాతావరణ మార్పులు, ఆరోగ్య పథకాలు, క్రిమినల్‌ జస్టిస్‌ తదితర అంశాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాను. ఇక అన్నింటి కంటే ముఖ్యమైన విషయం… శాంతిని పెంపొందించడం. ఇందుకోసం నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాను. వీటన్నిటి గురించి సమగ్ర అవగాహన వచ్చిన తర్వాతే 2020 ఎన్నికల్లో పోటీ చేసే విషయమై నిర్ణయం తీసుకున్నా’ అని తులసి వ్యాఖ్యానించినట్లు సీఎన్‌ఎన్‌ పేర్కొంది. దీనితో అధ్యక్ష పదవి కోసం బరిలో దిగే తొలి హిందువుగా తులసి చరిత్రకెక్కనున్నారను. అలాగే ఎన్నికల్లో గెలుపొందితే ఈ పదవి దక్కించుకున్న తొలి మహిళగా.. అత్యంత పిన్న వయస్సులో అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహించిన వ్యక్తిగా కూడా ఆమె నిలవనున్నారు.