అత్యయిక స్థితి విధించే దిశగా అడుగులు వేస్తున్న ట్రంప్

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో అత్యయిక స్థితి విధించే దిశగా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మెక్సికోతో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి నిధులు కేటాయించడంలో కాంగ్రెస్‌ అనుమతి అవసరం లేకుండా చేసేందుకు ఈ నిర్ణయం వైపు ఆయన మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అత్యయిక స్థితి విధించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు బుధవారం ప్రకటించిన ట్రంప్‌ తాజాగా తన హెచ్చరికను పునరుద్ఘాటించారు. దక్షిణాది సరిహద్దు రాష్ట్రం టెక్సాస్‌లో ఆయన గురువారం పర్యటించారు. అక్రమ వలసలను అడ్డుకునేందుకు గోడ అవసరమని స్పష్టం చేశారు. అందుకోసం అవసరమైతే అత్యయిక స్థితి విధించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కూడా  తెలిపారు. ఈ ప్రక్రియలో న్యాయపరంగా సవాళ్లు ఎదురైనా వెనుకంజ వేయబోమన్నారు. సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం 5.6 బిలియన్‌ డాలర్లు కేటాయించాలని ట్రంప్‌ చేసిన డిమాండ్‌కు కాంగ్రెస్‌ ససేమిరా అనడంతో ఇటీవల అమెరికా ప్రభుత్వం పాక్షికంగా మూతపడిన సంగతి తెలిసిందే. కాగా… స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈనెల 21 నుంచి ఐదు రోజులపాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సుకు ట్రంప్‌ హాజరుకావడం లేదు. ఈ సదస్సులో ప్రసంగించాలని తనకు బలమైన కోరిక ఉన్నా, ప్రభుత్వం మూతపడిన క్రమంలో తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది.