అనారోగ్యం తో షరీఫ్…..ఆయనను కలవడానికి అంగీకరించడం లేదు అన్న మరియం

వాస్తవం ప్రతినిధి:  పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ జైలు లో అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అల్-‌అజీజియా స్టీల్‌ మిల్స్‌కు సంబంధించిన అవినీతి వ్యవహారంలో ఆయనకు ఈ శిక్ష పడింది. ఈ నేపధ్యంలో లాహోర్‌లోని కోట్‌ లఖ్‌పట్‌ జైలులో షరీఫ్ ఏడేళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్నారు కూడా. అయితే ఆయన జైలులో అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఇటీవల  వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో షరీఫ్‌ ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఆయన వ్యక్తిగత వైద్యులు లోనికి వెళ్లేందుకు జైలు అధికారులు అనుమతించట్లేదని కుమార్తె మరియం నవాజ్‌ శుక్రవారం ఆరోపించారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘‘అనారోగ్యం దృష్ట్యా షరీఫ్‌ వైద్యులు (కార్డియాలజిస్టులు) జైలులో ఉన్న ఆయన్ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ జైలు అధికారులు అనుమతి మంజూరు చేయట్లేదు. షరీఫ్‌ ఎప్పటి నుంచో ఈ వైద్యుల వద్ద చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో ఆయనకు ప్రత్యేక చికిత్స అవసరం ఉంది’’ అని ట్వీట్‌ చేశారు. మరోవైపు పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ అధ్యక్షుడు, షరీఫ్‌ సోదరుడు షహ్‌బాజ్‌ షరీఫ్‌ దీనిపై స్పందిస్తూ.. తన సోదరుడికి ఏదైనా జరిగితే అందుకు ప్రధాని ఇమ్రాన్‌, పంజాబ్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు జైలు అధికారులు మాత్రం  షరీఫ్‌కు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నారు. మూడేళ్ల క్రితమే 69 ఏళ్ల నవాజ్‌ షరీఫ్‌కు లండన్‌లో ఓపెన్‌ హార్ట్‌ శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే.