అబుదాబీ లో వెలుగు చూసిన దారుణ ఘటన

వాస్తవం ప్రతినిధి: గురువారం అబుదాబీలో దారుణ ఘటన వెలుగు చూసింది.  ఏఎఫ్‌సీ ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ పోటీలు అబుదాబీ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే  గురువారం జరిగిన మ్యాచ్ లో  యూఏఈ బృందం చేతిలో భారత్‌ పరాజయం పాలైంది. అయితే, ఈ పోటీలకు ముందు ఓ యజమాని… భారత టీంకు మద్దతు పలుకుతున్నారంటూ తన పనివారిని పక్షుల గూటిలో నిర్బంధించాడు. దానికి సంబందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. దీంతో షార్జా పోలీసులు సదరు యజమానితో పాటు మరికొందరిని అరెస్ట్‌ చేశారు. అయితే… తాను సరదా కోసమే ఇదంతా చేశానని, తన వద్ద పనిచేసేవారితో 20 ఏళ్లుగా కలిసిమెలిసి జీవిస్తున్నానని నిందితుడు చెప్పినట్లు తెలుస్తుంది. ‘మీరు ఏ జట్టు గెలవాలని కోరుకుంటారు?’ అని షేక్‌ ప్రశ్నించాడు. ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ ఫ్యాన్స్‌ మూకుమ్మడిగా.. ‘భారత జట్టుకే మా మద్దతు’ అనగానే.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరంతా యూఏఈ జట్టుకే మద్దతు పలకాలని చేతిలో బెత్తం పట్టుకుని బెదిరించాడు. దాంతో ఫ్యాన్స్‌ యూఏఈకే మద్దతు పలుకుతామని చెప్పడంతో పంజరం నుంచి విడుదల చేశాడు. ఇదంతా కూడా ఆ వీడియోలో రికార్డ్ అయ్యింది.