చైనా కాన్సులేట్ పై దాడిలో భారత్ పాత్ర: పాకిస్థాన్

వాస్తవం ప్రతినిధి: పొరుగుదేశం పాకిస్థాన్ మరోసారి భారత్ పై తన విషాన్ని కక్కినది. కరాచీలోని చైనా కాన్సులేట్‌ కార్యాలయంపై నవంబర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో భారత గూఢచర్య సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) పాత్ర ఉందంటూ పాకిస్థాన్‌ పోలీసులు శుక్రవారం ఆరోపించారు. నవంబర్‌ 23న జరిగిన ఆ దాడికి సంబంధించి ఐదుగురు నిందితులను కరాచీ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా వేర్పాటువాద ‘బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ’కి చెందినవారని చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సీపెక్‌)ను అడ్డుకోవడానికి ఈ దాడిని జరిపినట్లు వారు తెలిపారని పేర్కొంది. అయితే ఈ దాడిలో హతమైన ముగ్గురు ఉగ్రవాదులకు తాము తోడ్పాటు అందించామని నిందితులు అంగీకరించినట్లు కరాచీ పోలీసు విభాగం అధిపతి అమీర్‌ షేక్‌ చెప్పారు. ఈ దాడికి కుట్ర అఫ్గానిస్థాన్‌లో జరిగిందని చెప్పారు. దీనికి ‘రా’ సహకరించిందన్నారు. ఈ ఆరోపణలను ఢిల్లీ లో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తీవ్రంగా ఖండించారు.