వారిపై వేటు పడడం సరైనదే: భజ్జీ

వాస్తవం ప్రతినిధి: ‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ షోలో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీమిండియా ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌ను వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ తీవ్రంగా విమర్శించాడు. క్రికెటర్ల గౌరవాన్ని వారు తాకట్టు పెట్టారంటూ భజ్జీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. షోలో ముఖ్యంగా పాండ్య చేసిన వ్యాఖ్యలు జట్టు సంస్కృతిపై సందేహాలు వ్యక్తం చేసేలా ఉన్నాయి అని భజ్జీ అన్నారు. అలానే మరోపక్క వీరి వ్యాఖ్యలను కోహ్లీ సైతం విమర్శించాడు. దాంతో రాహుల్‌, పాండ్యను బీసీసీఐ సస్పెండ్‌ చేసింది. విచారణకు ఆదేశించింది.
‘మేం ఇలాంటివి కనీసం మా మిత్రులతోనూ చర్చించం. వారు టీవీల్లో కనిపిస్తారు. ఇప్పుడు ప్రజలు హర్భజన్‌ సింగ్‌ ఇలాంటోడు, అనిల్‌ కుంబ్లే అలాంటోడు, సచిన్‌ ఇలాంటివాడు అనుకునే ప్రమాదం ఉంది’ అని భజ్జీ అన్నాడు. ఎక్కువ మంది మహిళలతో కలవాలని ఉందని తల్లిదండ్రులకు చెప్పినట్టు పాండ్య షోలో నోరుజారాడు. కాగా మహిళలు, బంధాలపై రాహుల్‌ కాస్త జాగ్రత్తగా మాట్లాడాడు. ‘మరి మీ జట్టు సహచరుల గదుల్లో పని కానిచ్చేశారా?’ అని షోలో కరణ్‌ ప్రశ్నించగా రాహుల్‌, పాండ్య సానుకూలంగా స్పందించారు. ‘జట్టు సంస్కృతి గురించి అసభ్యకరంగా మాట్లాడానికి పాండ్య ఎంత కాలం నుంచి జట్టులో ఉంటున్నాడు? వారిపై ఇలా కఠినంగా వ్యవహరించడమే మంచిది. బీసీసీఐ సరైన పనే చేసింది. వేటు వేయడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు’ అని హర్భజన్‌ తెలిపాడు. సస్పెండ్‌ అయిన రాహుల్‌, పాండ్య ఆస్ట్రేలియా నుంచి తిరిగి భారత్‌కు వస్తున్న సంగతి తెలిసిందే.