కోహ్లీ,రవి శాస్త్రీ లకు అరుదైన గౌరవం

వాస్తవం ప్రతినిధి: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. సిడ్నీ క్రికెట్‌ మైదానం (ఎస్‌సీజీ) వారిని జీవిత కాల గౌరవ సభ్యులుగా ఎంపిక చేసింది. క్రికెట్‌కు చేసిన సేవలు, సిడ్నీ మైదానంలో చరిత్ర సృష్టించినందుకు వారిని ఇలా సత్కరించినట్లు తెలుస్తుంది. వీరిద్దరినీ మినహాయిస్తే ఇంతకు ముందు దిగ్గజాలు సచిన్‌ తెందుల్కర్‌, బ్రయన్‌ లారాకు మాత్రమే ఎస్‌సీజీ గౌరవ సభ్యత్వం లభించింది. ఈ సందర్భంగా కోహ్లీతో కలిసి సభ్యత్వం అందుకున్న రవిశాస్త్రి ట్విటర్‌లో ఈ విషయం వెల్లడించారు.
‘విరాట్‌ కోహ్లీతో కలిసి ఎస్‌సీజీ గౌరవ సభ్యత్వం అందుకోవడం చాలా సంతోషకరం. గౌరవం’ అని రవిశాస్త్రి ట్వీట్‌ చేశాడు. శాస్త్రి, కోహ్లీ సారథ్యంలోని జట్టు ఆస్ట్రేలియాలో 2-1తో టెస్టు సిరీస్‌ గెలిచిన సంగతి తెలిసిందే. ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ కైవసం చేసుకున్నందుకు ఎస్‌సీజీ ఛైర్మన్‌ టోనీ షెపర్డ్‌ అభినందనలు తెలియజేశారు. అతిపెద్ద క్రికెటింగ్‌ దేశం టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించడం అద్భుతమని పేర్కొన్నారు.