ఆంధ్రప్రదేశ్ లో రెండు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కీలక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సీఎం శంకుస్థాన చేశారు. రూ.1387 కోట్లతో 3.2 కిలోమీటర్ల మేర ఐకానిక్ వంతెన నిర్మాణం జరుగనుంది. ఇబ్రహీంపట్నం-ఉద్దండరాయునిపాలెంను కలుపుతూ కేబుల్‌ వంతెనను నిర్మించనున్నారు. హైదరాబాద్‌, భద్రాచలం హైవేల మీదుగా నేరుగా అమరావతి వెళ్లేలా వంతెన రూపకల్పన చేస్తున్నారు. భారతీయ యోగముద్రతో ఎల్‌అండ్‌టీ సంస్థ వంతెన డిజైన్‌ రూపొందించింది. తక్కువ పిల్లర్లు, ఎక్కువ కేబుళ్లతో ఐకానిక్‌ వంతెన నిర్మాణం జరుగనుంది. అలాగే రూ.750 కోట్లతో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించారు.