వారిద్దరికీ సీఎం పదవి మీదే ధ్యాస : పవన్ కళ్యాణ్

 వాస్తవం ప్రతినిధి: సిఎం చంద్రబాబు, వైసిపి అధినేత జగన్ లకు సీఎం పదవి మీదే ధ్యాస ఉందే తప్ప .. ప్రజల మీద కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు.కృష్ణా జిల్లా నేతలతో కీలక వ్యాఖ్యలు చేసిన జనసేనాని, మళ్లీ సీఎం గా రావాలి అని చంద్రబాబు, 30 ఏళ్ళు సీఎంగా ఉండాలని జగన్ కలలు కంటున్నారన్నారు. ప్రజల సమస్యలు ఏ మాత్రం చంద్రబాబు, జగన్ లకు పట్టవని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు సీట్లు రావని ఒకవైపు అంటున్న నేతలే.. తమతో కలిసి రావాలని వెంపర్లాడుతున్నట్లు ఆయన చెప్పారు. టిక్కెట్ల కోసం టిఆర్ఎస్ నేతలతో సైతం మాట్లాడిస్తున్నారన్న పవన్ , ఇదే మన బలానికి నిదర్శనమని చెప్పారు. 2014లో టీడీపీకి జనసేన మద్దతు తన వ్యూహం లో భాగమని పార్టీ నేతలకు వివరించారు. అయితే ఇప్పటి ఎమ్మెల్యేలు కేవలం దోచుకోవడం మీదే దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు.రాజధాని అంటే లక్ష కోట్ల వ్యవహారమని, దాన్ని సమంగా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు.సినిమాల్లో నటించేటపుడు కొందరికి సాయం చేసానని, చాలా మందికి సాయం చేయాలంటే రాజకీయాల్లోకి రావటమే మార్గమని నమ్మినట్లు పవన్ తెలిపారు. ప్రజారాజ్యం వైఫల్యం తర్వాత పార్టీ పెట్టి నిలబడగలనా అనే అనుమానం వచ్చిందని.. అయితే ప్రజల ఆదరణ అనుమానాలను పటాపంచలు చేసిందని చెప్పుకొచ్చారు.కొందరు నేతలు దిగజారి మాట్లాడుతున్నారని, తాను దిగజారలేనని జనసేన అధినేత కామెంట్ చేశారు.