యూపీ లో సీట్లను సమానంగా పంచుకున్న ఎస్పీ,బీఎస్పీ లు

వాస్తవం ప్రతినిధి: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో పట్టు సాదించేందుకు సమాజ్ వాదీ(ఎస్పీ)పరి,బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) పార్టీ లు కలిసి ఈ సారి ఎన్నికల్లో పోటీ పడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే.  ఇందులో భాగంగా ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి శనివారం సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పొత్తు, సీట్ల పంపకాల గురించి ప్రకటన చేశారు. మాయావతి మాట్లాడుతూ.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇది దేశ రాజకీయాల్లో సరికొత్త విప్లవానికి దారి తీస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా బీఎస్పీ 38 స్థానాల్లో, ఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మిగతా నాలుగు సీట్లను ఇతర పార్టీలకు వదిలినట్లు ఆమె తెలిపారు. అమేథి, రాయ్‌బరేలి స్థానాలను కాంగ్రెస్‌ కోసం విడిచిపెట్టినట్లు చెప్పారు. దేశ ప్రజల ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుంటున్నాం. ఈ పొత్తు రెండు పార్టీల ప్రయోజనాల కోసం కాదు. భాజపాకు సమాధానం చెప్పేందుకు ఇదొక చారిత్రక సమావేశం అని ఆమె స్పష్టం చేశారు. 1993లో బీఎస్పీ చీఫ్‌ కాన్షీరామ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌ కలిసి యూపీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇప్పుడు మేం కూడా అదే స్ఫూర్తితో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఎస్పీ-బీఎస్పీ పొత్తు పేదలు, కార్మికులుయువత, మహిళలువెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీల కోసమేఅని మాయవతి స్పష్టం చేశారు.