చిదంబరం సతీమణి నళిని మీద సీబీఐ అభియోగ పత్రం దాఖలు

వాస్తవం ప్రతినిధి:  శారదా చిట్‌ ఫండ్ కుంభకోణానికి సంబంధించి శుక్రవారం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ,కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం మీద అభియోగపత్రం దాఖలు చేసినట్లు తెలుస్తుంది. శారదా గ్రూప్‌ ఆఫ్ కంపెనీస్‌ నుంచి ఆమె రూ.1.4 కోట్లు తీసుకున్నారంటూ ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో  ఆ అభియోగపత్రాన్ని కోల్‌కతా ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించింది. ఆ కంపెనీకి చెందిన సుదిప్తా సేన్‌, ఇతర ప్రొప్రయిటర్లతో కలిసి నళిని కుట్రకు పాల్పడ్డారని అభియోగాలు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కేంద్ర మాజీ మంత్రి మాతంగ్‌ సింగ్ మాజీ భార్య మనోరంజనా సింగ్..సేన్‌కు నళిని చిదంబరాన్ని పరిచయం చేశారని, చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తును పక్కదారి పట్టించేలా సెబీ, ఆర్ఓసీ వంటి సంస్థలను మేనేజ్‌ చేయడం కోసం ఆమె సహకరించారని పేర్కొంది. దానికి ఫలితంగా నళిని రూ.1.4 కోట్లను పొందారని ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి ఇది ఆరో అభియోగపత్రం. పెద్దమొత్తంలో వడ్డీలు చెల్లిస్తామని శారదా కంపెనీ ప్రజల నుంచి రూ.2,500 కోట్లు సేకరించింది. ప్రజలకు తిరిగి డబ్బు చెల్లించలేక సేన్ 2013 నుంచి దాని కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.