ఆప్ నేత మీరా సన్యాల్ కన్నుమూత

వాస్తవం ప్రతినిధి:  ప్రముఖ బ్యాంకర్‌, ఆప్‌ నేత మీరా సన్యాల్‌ (57) కన్నుమూసినట్లు తెలుస్తుంది. గతకొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది. దేశంలో రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్కాట్‌లాండ్‌కు  సీఎండీగా మీరా పనిచేశారు. దాదాపు 30 సంవత్సరాల  బ్యాంకునకు సేవలందించిన అనంతరం ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు ఆమె ఆసక్తి చూపారు. ఈ నేపథ్యంలో సన్యాల్‌  పదవికి రాజీనామా చేసి ఆమ్‌ ఆద్మీ  పార్టీలో చేరారు. పార్టీ తరపున 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అంతకుముందు 2009లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అప్లి ముంబై అనే సంస్థతో సామాజిక కార్యకర్తగా మీరా పేరు పొందారు. అయితే  మీరా సన్యాల్‌ అకాల మృతిపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా మనీష్‌ సిసోడియా తదితర పార్టీనేతలతో పాటు, మాజీ ఆప్‌ నేత, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, ఇంకా పలువురు ప్రముఖులు మీరా మరణంపై విచారం వ్యక్తం  చేశారు.