కేజ్రీ ని కలిసిన ప్రకాశ్

వాస్తవం ప్రతినిధి: విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ప్రకాశ్‌ రాజ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీపార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ తో భేటీ అయినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చలు జరిపినట్లు ప్రకాశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రకాశ్‌ రాజ్‌ను కలిసిన విషయం గురించి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ట్వీట్‌ చేశారు. ‘ప్రకాశ్‌ జీ ఈ రోజు మిమ్మల్ని కలవడం చాలా బాగుంది. మనం చర్చించిన ప్రతి అంశానికి నేను పూర్తిగా మద్దతిస్తున్నాను. మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేయడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఏ రాజకీయ పార్టీలతో సంబంధంలేని.. స్వతంత్ర అభ్యర్థులు పార్లమెంట్‌లో ఉండటం చాలా అవసరమం’టూ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. గౌరీ లంకేష్‌ హత్య అనంతరం ప్రకాశ్‌ రాజ్‌.. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలిసారి ప్రకాశ్‌ రాజ్‌ కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి మద్దతిస్తున్నట్లు తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ప్రకాశ్‌ రాజ్‌ కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు.