రాహుల్ కు నోటీసులు జారీ చేసిన మహిళా కమీషన్

వాస్తవం ప్రతినిధి: ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌పై అనైతిక వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) గురువారం నోటీసులు జారీ చేసింది. జైపూర్‌లో ఈ నెల 9న నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే క్రమంలో రాహుల్‌ నిర్మలా సీతారామన్‌పై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘పార్లమెంట్‌లో రఫేల్‌ ఒప్పందం గురించి చర్చ జరిగే సమయంలో ప్రధాని మోదీ పారిపోయి తనను కాపాడమని ఓ మహిళ (నిర్మలా సీతారామన్‌)ను కోరారు. ఆయన తనను తాను కాపాడుకోలేకపోయారు’అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్‌ రాహుల్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.