ఫెదరర్ తో తలపడనున్న నాదల్

వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)తో తలపడే అవకాశాలున్నాయి. గురువారం విడుదల చేసిన ఈ టోర్నీ డ్రా ప్రకారం సెమీస్‌ వరకు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫెదరర్‌కు గట్టిపోటీదారులు లేరు. మూడో సీడ్‌గా బరిలో దిగుతున్న రోజర్‌.. సింగిల్స్‌ తొలి రౌండ్లో 99వ ర్యాంకర్‌ డెన్నిస్‌ ఇస్తోమిన్‌ (రష్యా)తో తలపడనున్నాడు. మరోవైపు గాయాల నుంచి కోలుకుని బరిలో దిగుతున్న రెండో సీడ్‌ నాదల్‌ తొలి రౌండ్లో డక్‌వర్త్‌ (ఆస్ట్రేలియా)తో పోటీపడనున్నాడు. ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా)కు కాస్త క్లిష్టమైన డ్రా పడింది. అతనికి రెండో రౌండ్లోనే ఫ్రాన్స్‌ స్టార్‌ సోంగా ఎదురయ్యే అవకాశాలున్నాయి. అన్‌సీడెడ్‌గా పోటీలో ఉన్న ఆండీ ముర్రే.. తొలి రౌండ్లో బటిస్టా అగట్‌ (స్పెయిన్‌)తో తలపడనున్నాడు. మరోవైపు 24వ టైటిల్‌ గెలిచి.. మార్గరెట్‌ కోర్ట్‌ రికార్డును సమం చేయాలని ఉవ్విళ్లూరుతున్న అమెరికా తార సెరెనా విలియమ్స్‌కు కఠినమైన డ్రా పడింది. తొలి రౌండ్లో మారియా (జర్మనీ)తో ఆడనున్న సెరెనాకు రెండో రౌండ్లో బౌచర్డ్‌, మూడో రౌండ్లో అక్క వీనస్‌ విలియమ్స్‌, ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ సిమోనా హలెప్‌ ఎదురయ్యే అవకాశాలున్నాయి. టాప్‌సీడ్‌గా పోటీలో ఉన్న హలెప్‌.. తొలి రౌండ్లో కనెపి (ఇస్తోనియా)తో ఆడనుంది.