యూఏఈ చేతిలో ఓటమి పాలైన భారత్

వాస్తవం ప్రతినిధి: ఆసియాకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్లో భారత జోరుకు బ్రేక్‌… తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసి మంచి ఊపు మీదున్న భారత్‌.. గురువారం ఆతిథ్య యూఏఈతో జరిగిన గ్రూప్‌-ఎ పోరులో 0-2 గోల్స్‌తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గట్టిగానే పోరాడినా.. ర్యాంకింగ్స్‌లో తనకన్నా మెరుగైన యూఏఈ జట్టు ముందు నిలువలేకపోయింది. ఆరంభంలో రెండు జట్లకు సమానమైన అవకాశాలు వచ్చిన సద్వినియోగం చేసుకోలేకపోయాయి. అయితే 41వ నిమిషంలో ముబారక్‌ చేసిన గోల్‌తో యూఏఈ ఆధిక్యంలోకి వెళ్లింది. స్కోరు సమం చేయడానికి భారత్‌ విఫలయత్నం చేసింది. అయితే 88వ నిమిషంలో అలీ గోల్‌ చేసి భారత ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్‌కు నాకౌట్‌ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. సోమవారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో బహ్రెయిన్‌తో భారత్‌ గెలిస్తే ముందంజ వేస్తుంది.