మ్యాచ్ ఫిక్సర్స్ వలపన్నే అవకాశాలు ఉంటాయి: అనిరుధ్ చౌదరి

వాస్తవం ప్రతినిధి: ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో టీమిండియా క్రికెటర్లు హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌ నోరు జారడం చూస్తుంటే వారిపై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ సిండికేట్లు వలపన్నే అవకాశాలు ఉంటాయని బీసీసీఐ కోశాధికారి అనిరుధ్‌ చౌదరి అన్నారు. ‘ఆ షోలో ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలి. వారు నోరు జారిన విధానం చూస్తుంటే అంతర్జాతీయంగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్న వ్యవస్థీకృత సిండికేట్లు వలవేసి ఉచ్చులో పడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐసీసీ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఫిక్సర్లు ఎలా వల పన్నుతారో వెంటనే ఆటగాళ్లకు తెలియజేయాలన్నది నా షరతు’ అని క్రికెట్‌ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీకి తన అభిప్రాయాన్ని అనిరుధ్‌ లేఖ రూపంలో పంపించారు. ఆ ఆటగాళ్లను వెంటనే సస్పెండ్‌ చేసి విచారణ జరపాలని అనిరుధ్‌ కోరారు. విచారణ పూర్తైన తర్వాతే జట్టులోకి ఎంపిక చేయాలని డిమాండ్‌ చేశారు. వారితో కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఇలాంటి మనోరంజక షోలలో పాల్గొనే నిబంధనలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఆ ఆటగాళ్లు అనుమతి తీసుకున్నారా? తీసుకుంటే ఎవరు అనుమతి ఇచ్చారు? అనేది తెలుసుకోవాలని ఎడుల్జీని ఆయన కోరారు. మీడియాకు ముఖాముఖి ఇవ్వవాలంటే కచ్చితంగా బోర్డు అనుమతి తీసుకొనేలా నిబంధనలు ఏర్పాటు చేయాలని సూచించారు.