అలోక్ చేసిన బదిలీలను రద్దు చేసిన సీబీఐ తాత్కాలిక డైరక్టర్

వాస్తవం ప్రతినిధి: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాజీ సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ చేసిన బదిలీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది. బుధవారం తిరిగి సీబీఐ డైరెక్టర్ గా భాద్యతలు చేపట్టిన అలోక్ వర్మ తానూ వెళ్ళిపోయాక సీబీఐ లో చోటుచేసుకున్న బదిలీలను రద్దు చేశారు. ఆలోక్‌, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా మధ్య విభేదాలు ముదరడంతో వారిద్దరినీ నిర్బంధ సెలవుపై పంపిస్తూ గతేడాది అక్టోబరు 23న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆలోక్‌ సుప్రీంను ఆశ్రయించగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సీబీఐ డైరెక్టర్‌గా ఆయనకు తిరిగి పగ్గాలు అప్పగిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో 77రోజుల నిర్బంధ సెలవు తర్వాత ఆలోక్‌ బుధవారం తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలో ఆయన లేనప్పుడు జరిగిన బదిలీలను రద్దు చేశారు. అయితే గురువారం సాయంత్రమే కేంద్రం ఆయనకు షాక్ ఇచ్చింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆలోక్‌ను తొలగించడానికి కొన్ని గంటల ముందు ఆయన ఐదుగురు సీబీఐ ఉన్నతాధికారులను బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాపై నమోదైన అవినీతి కేసు దర్యాప్తు అధికారి(ఐవో)గా ఎస్పీ హోదాలోని మోహిత్‌ గుప్తాను ఆలోక్‌ నియమించారు. అస్థానా కేసును విచారిస్తున్న డీఎస్పీ ఎ.కె.బస్సి, అదనపు ఎస్పీ ఎస్‌.ఎస్‌.గుర్మ ఐవోలుగా ఉండగా వారి స్థానంలో సతీశ్‌ దాగర్‌ నియమితులయ్యారు. సతీశ్‌ను తప్పించి గుప్తాకు ఆలోక్‌ బాధ్యతలు అప్పగించారు. వారందరి బదిలీలను తాత్కాలిక సీబీఐ డైరెక్టర్‌ నాగేశ్వరరావు రద్దు చేశారు. గతంలో ఉన్న స్థానాల్లోనే వాళ్లను కొనసాగాల్సిందిగా సూచించారు.