అలోక్ వర్మకు మరోసారి ఉద్వాసన పలికిన కేంద్రం

వాస్తవం ప్రతినిధి: సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ అవమానకర రీతిలో ఉద్వాసన పలికింది. ఆయనను తిరిగి విధులలో కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రెండు రోజులకే తొలిగించింది. అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణలో అలక్ష్యం, ఆశించిన రీతిలో విశ్వసనీయతతో విధులు నిర్వహించక పోవడంవల్లనే అలోక్‌వర్మను విధుల నుంచి తొలిగిస్తున్నట్టు అత్యున్నత కమిటీ ప్రకటించింది. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మ రెండేండ్ల పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. కాగా ప్రభుత్వం ఆయనను కేంద్ర హోం శాఖ పరిధిలోని అగ్నిమాపక సేవలు, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్స్ శాఖల డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. సీబీఐ 55 ఏండ్ల చరిత్రలో పదవీ కాలం ముగియకుండా సంస్థ డైరెక్టర్ ఇలా ఉద్వాసనకు గురికావడం ఇదే మొదటిసారి. సీబీఐ డైరెక్టర్ బాధ్యతలను అదనపు డైరెక్టర్‌గా ఉన్న మన్నెం నాగేశ్వరరావుకు మరోసారి అప్పగిస్తూ కేంద్రం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావుకు కేంద్రం బాధ్యతలు అప్పగించింది. సీబీఐ కొత్త డైరెక్టర్‌ను నియమించే వరకు లేదా తుది ఉత్తర్వులు వెలువడే వరకు నాగేశ్వరరావు బాధ్యతలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్‌ వర్మను ఫైర్‌ సర్వీసెస్‌ అండ్‌ హోంగార్డు విభాగానికి డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేశారు. ఇవాళ సాయంత్రం ప్రధాని నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశమైంది. కమిటీలో సభ్యులుగా లోక్‌సభ ప్రతిపక్షనేత, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉన్నారు. సీబీఐ డైరెక్టర్‌ నియామకంపై దాదాపు రెండు గంటల పాటు ఉన్నతస్థాయి కమిటీ చర్చించింది. అలోక్‌వర్మను సీబీఐ డైరెక్టర్‌గా తొలిగించాలన్న నిర్ణయాన్ని ఉన్నతస్థాయి కమిటీలోని ముగ్గురిలో ప్రధాని మోదీ, చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రతినిధి జస్టిస్ ఏకే సిక్రీ సమర్థించగా, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే వ్యతిరేకించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.