యూపీ లో బీజేపీ కి ఎదురుదెబ్బ……బీఎస్పీ,ఎస్పీ లు కలిసి బరిలోకి!

వాస్తవం ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ కి గట్టి ఎదురు దెబ్బ కొట్టాలన్న ఉద్దేశ్యం తో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ),బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) లు పావులు కదుపుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో తిరిగి పట్టు సాధించేందుకు ఈ రెండు పార్టీలు సన్నద్ద మౌతున్నాయి. ఏళ్ల నాటి వైరాన్ని పక్కనబెట్టి బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)తో చేతులు కలిపేందుకు ఎస్పీ పార్టీ సిద్ధమైంది. ఈ మహాకూటమిపై రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి కలిసి శనివారం మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలోనే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో కూటమిపై గత కొన్ని రోజులుగా అఖిలేశ్‌, మాయావతి విస్తృత స్థాయిలో సమావేశాలు జరిపారు. గతవారం ఢిల్లీ లో భేటీ అయిన వీరిద్దరూ దాదాపు సీట్ల పంపకాలను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎస్పీ, బీఎస్పీతో పాటు రాష్ట్రీయ లోక్‌దళ్‌, నిషద్‌ పార్టీ లాంటి చిన్న పార్టీలను కూడా కలుపుకుని మహాకూటమిగా బరిలోకి దిగాలని అఖిలేశ్‌, మాయావతి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ మహాకూటమిలో కాంగ్రెస్‌కు మాత్రం చోటు దక్కే అవకాశాలు కన్పించట్లేదు. కాంగ్రెస్‌ వైఖరిపై అఖిలేశ్‌, మాయావతి అసంతృప్తిగా ఉన్నారని, ఆ పార్టీని కూటమిలో చేర్చుకునేందుకు సుముఖంగా లేరని ఇటీవల వార్తలు వచ్చాయి. వీటిపై హస్తం పార్టీ కూడా స్పందించింది. యూపీలో ఒంటరిపోరుకు తాము సిద్ధమవుతున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది.