జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సూపర్ హిట్ అయ్యింది :ఉండవల్లి

వాస్తవం ప్రతినిధి: వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సూపర్ హిట్ అయ్యిందని ఉండవల్లి ప్రశంసించారు. ” గతంలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్రల కంటే జగన్ పాదయాత్ర చాలా హిట్ అయ్యింది. ఈ పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ” అని ఉండవల్లి విశ్లేషించారు.

రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ మక్తాయింపు ఇచ్చారు. జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఇప్పుడే ముఖ్యమంత్రి అయిపోవాలని లేదని, మరో 15 సంవత్సరాలు వరకూ ఆయన వేచి చూస్తానని ఆయన తనతో అన్నారని ఉండవల్లి చెప్పారు.

అలాగే ఈ రోజున పబ్లిక్ లో చంద్రబాబుకి అంత అనుకూలంగా లేదని, అదే, జగన్ కు బాగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే, వచ్చే మూడు నెలల్లో ఏదైనా జరగొచ్చని, వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను కేటాయించడం, టికెట్లు లభించని వారి ప్రభావం, వాళ్లు మీడియా ముందు ఏం చెబుతారన్న అంశాలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని, అందుకే, చివరి నిమిషం వరకూ చాలా జాగ్రత్తగా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ఉండవల్లి .