సంక్రాంతి పండగను తెనాలిలో జరుపుకోనున్న పవన్ కళ్యాణ్

వాస్తవం ప్రతినిధి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈసారి సంక్రాంతి పండగను తెనాలిలో జరుపుకోనున్నారు. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కు చెందిన పెదరావూరులోని వ్యవసాయ క్షేత్రంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నారు. ఈ నెల 13వ తేదీన భోగి పండగతో సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే భోగి మంటల వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొంటారని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి తెలిపారు.

రైతులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో, ప్రజలతో జరిగే సమావేశంలో, ఈ సందర్భంగా మహిళలు నిర్వహించే ‘సంక్రాంతి శోభ’లో ఆయన పాల్గొంటారు. ఇదే వేదికగా జనసేన పార్టీ సాంస్కృతిక వేదికను పవన్ ప్రారంభించనున్నారు. ‘జనసేన’ కళాకారులు రూపొందించిన ఆడియో, వీడియోలను పవన్ కల్యాణ్ ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. 13వ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమయ్యే సంబరాలు రాత్రి ఎనిమిది గంటలకు ముగుస్తాయని మహేందర్ రెడ్డి వివరించారు.