చతేశ్వర్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు: శుభ్ మన్ గిల్

వాస్తవం ప్రతినిధి: టీమిండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా బ్యాటింగ్‌ చూసి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చని పంజాబ్‌ యువ కెరటం, అండర్‌-19 ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అతడి ప్రదర్శన అద్భుతమని గిల్ ప్రశంసించాడు. ఈ సిరీస్‌లో పుజారా 1,238 బంతులు ఎదుర్కొని 521 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. సిడ్నీ టెస్టులో త్రుటిలో ద్విశతకం చేజార్చుకున్నాడు. ‘బంతిని చూసి రోజంతా ఆడగలిగే బ్యాట్స్‌మెన్‌ కొందరే ఉంటారు. ఆస్ట్రేలియా పర్యటనలో పుజారా 1200 బంతులకు పైగా ఎదుర్కొన్నాడు. ఇదో అద్భుతం. ఒక సిరీస్‌లో 500 పరుగులు చేయడం సులభమే. చాలా ఎక్కువ బంతులు ఆడి ఆయన యువతరానికి ఒక ఆదర్శంగా నిలిచాడు. పుజారా ఓపిక, బ్యాటింగ్‌ చూసి ఎంతో నేర్చుకోవచ్చు. ఆస్ట్రేలియాకు ప్రపంచ స్థాయి బౌలింగ్‌ దళం ఉంటుంది. అక్కడి కఠిన పిచ్‌లపై వారిని ఎదుర్కొంటూ పరుగులు చేయడం చాలా కష్టం. ఈ రోజులలో ఆటగాళ్లంతా త్వరగా పరుగులు చేయడంపైనే దృష్టి సారిస్తున్నారు’ అని గిల్‌ అన్నాడు