క్రమ శిక్షణ కమిటీ ముందు హాజరైన సర్వే

వాస్తవం ప్రతినిధి: ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ నుంచి సర్వే సత్యనారాయణ ను సస్పెండ్‌ చేస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సర్వే సత్యనారాయణ గురువారం ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. దీనిపై క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ ఏకే ఆంటోనికి వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యాను. కమిటీ సభ్యులు నిన్ను సస్పెండ్‌ చేయడమేంటని అడిగారు. డోంట్‌ వర్రీ, ఫిర్యాదు రాసి ఇవ్వమన్నార’ని తెలిపారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియాపై సర్వే మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తమ్‌, కుంతియాల వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని విమర్శించారు.