ధ‌ర్మాస‌నం నుంచి వైదొలిగిన‌ జ‌డ్జి.. అయోధ్య కేసు వాయిదా

వాస్తవం ప్రతినిధి: అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో వాదనలు వినేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ ధర్మాసనం గురువారం విచారణ ప్రారంభించింది. అయితే బెంచ్‌లో ఒకరైన జస్టిస్‌ యు.లలిత్‌ విచారణ నుంచి తప్పుకోవడంతో తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. ఈ కేసులో కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేస్తామని న్యాయస్థానం వెల్లడించింది.

గతంలో అయోధ్య కేసులో కల్యాణ్ సింగ్ తరఫున ప్రస్తుతం జస్టిస్ గా ఉన్న లలిత్ వాదించారని గుర్తు చేసిన న్యాయవాది రాజీవ్ ధావన్, ఆయన వాదనలు ఎలా వింటారన్న ప్రశ్నను లేవనెత్తారు. ధర్మాసనంలో జస్టిస్ లలిత్ ఉండటంపై ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో, తాను తప్పుకుంటున్నట్టు జస్టిస్ లలిత్ ప్రకటించారు. దీంతో మరో ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన సీజే, విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.