కేసీఆర్ బాటలో జగన్..!!!

వాస్తవం ప్రతినిధి: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కొన్ని సంచలన ప్రకటనలు చేశారు. దాదాపు 3648 కిలో మీటర్ల సాగిన సుదీర్ఘ యాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలని దగ్గరగా చూశానని. వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో, వారి కష్టాలు తీరే మార్గాలు ఎలా చూపించాలో తనకి స్పష్టంగా అర్థం అయ్యిందని అన్నారు. అయితే పాదయాత్రలో భాగంగా జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన హామీలని మరో సారి గుర్తు చేస్తూ అధికారంలోకి రాగానే వీటిని తప్పకుండా నేరవేర్చుతానని అన్నారు. ఇదిలాఉంటే

ఇచ్ఛాపురం బహిరంగ సభా వేదికపై నుంచి ప్రసంగించిన జగన్ తన భవిష్యత్తు ప్రణాళికలు వివరిస్తూనే కీలక ప్రకటన చేశారు. అదేంటంటే..తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్పు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రకటన ఎంతో సాహసోపేతమైన నిర్ణయమనే చెప్పాలి. ఎందుకంటే జిల్లాలని విభజించడం అంటే మాటలు కాదు.

అందుకు తగ్గ యంత్రాంగం ఉండాలి, అధికారుల కొరత ఇప్పటికే ఎక్కువగా ఉన్న ఏపీ లో జగన్ ఈ వాగ్ధానం ఎలా అమలు అవుతుంది. అయితే ఈ చిన్న జిల్లాల ఏర్పాటు వలన ప్రజా ఆమోదయోగ్యమైన పాలనని అందించడంలో మాత్రం ప్రభుత్వాలు సక్సెస్ అవుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక పొతే కేసీఆర్ సైతం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకూ 10 జిల్లాలుఆ ఉన్న రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా మార్చేశాడు దాంతో ప్రజలకి సుపరిపాలన అందించడం సులభం అయ్యింది. మరో సారి అధికారంలోకి కేసీఆర్ రావడానికి ఉపయోగపడింది.

ఈ పరిస్థితులని గమనించిన జగన్ ఇప్పుడు కేసీఆర్ మాదిరిగానే కొత్త జిల్లాల ప్రతిపాదనని తెరపైకి తీసుకువచ్చాడు. అది కూడా పాదయాత్ర ముగింపు సమయంలో ప్రస్తావించారు అంటే ఇప్పటికే ఆ విషయంలో గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారనే అంటున్నారు పరిశీలకులు. తాము గనుక అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రతీ పార్లమెంటును ఓ జిల్లాగా చేస్తానని జగన్ ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలని 25 జిల్లాలుగా చేసి నూతన ఆంధ్రప్రదేశ్ ని నిర్మిస్తానని జగన్ అన్నారు. అయితే జగన్ చేసిన ఈ తాజా ప్రకటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ ప్రకటన జగన్ ని ఎంత వరకూ సీఎం కుర్చీ ఎక్కిస్తాయో వేచి చూడాలి.