మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కన్నుమూత

వాస్తవం ప్రతినిధి: కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎం. నారాయణ రెడ్డి (68) గురువారం కన్నుమూసినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వారం కిందట చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న నారాయణ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు అక్కడి వైద్యులు వెల్లడించారు. 1994లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఆయన రెండు పర్యాయాలు శాసనసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఆయనకు పేరుంది. నియోజకవర్గ అభివృద్ధిలో నారాయణ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల స్థానిక నేతలతో పాటు జిల్లాలోని వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తంచేశారు. నారాయణ రెడ్డికి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలుస్తుంది.