ఈబీసీ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం లో పిటీషన్

వాస్తవం ప్రతినిధి: అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం కూడా లభించింది. అయితే ఈ ఈబీసీ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తుంది. రిజర్వేషన్లకు కేవలం ఆర్థిక స్థితిగతులు మాత్రమే కారణంగా చూపలేమని, అందువల్ల ఆ బిల్లును రద్దు చేయాలని యూత్ ఫర్ ఈక్వాలిటీ ఆర్గనైజేషన్, కౌషల్ కాంత్ మిశ్రా ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగం మౌలిక స్వరూపానికి ఇది విరుద్ధమని, 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని మించరాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బుధవారం సుమారు పది గంటల చర్చ తర్వాత రాజ్యసభ కూడా ఈ బిల్లును ఆమోదించింది. ప్రస్తుతం కుల ఆధారిత రిజర్వేషన్లు 50 శాతానికి అదనంగా ఈ పది శాతం ఈబీసీ కోటాను ప్రభుత్వం తీసుకురానుంది. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా మెజార్టీ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి.