కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ వంద కోట్ల ఆఫర్: డిగ్గీ రాజా

వాస్తవం ప్రతినిధి: కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు.. బీజేపీ వంద కోట్ల రూపాయలు ఆఫర్‌ చేసిందంటూ మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మీడియా తో మాట్లాడుతూ…. బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్‌ త్రిపాఠి… సబల్‌ఘర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్‌ నేత బాజీనాథ్‌ కుశ్వాహను కలిసి,అనంతరం ఆయనను ఓ దాబాకు తీసుకువెళ్లారు. అక్కడే బీజేపీ మాజీ మంత్రులు నరోత్తమ్‌ మిశ్రా, విశ్వాస్‌ సారంగ్‌ బాజీనాథ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహాయం చేస్తే 100 కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆయనకు ఆశ జూపారు. అలాగే వారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి కూడా కట్టబెడతామని ఆయనకు చెప్పినట్లు దిగ్విజయ్ ఆరోపించారు. అయితే బాజీనాథ్‌ వీటిని తిరస్కరించారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఇలా దిగజారుడు చర్యలకు పాల్పడుతోంది’ అని డిగ్గీ రాజా వ్యాఖ్యానించారు.