మహా కూటమి లో చేరే ఉద్దేశ్యమే లేదు: నవీన్ పట్నాయక్

వాస్తవం ప్రతినిధి: మహా కూటమిలో చేరే ఉద్దేశమేమీ లేదని బిజూ జనతాదళ్‌ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా కూటమిలోగానీ, భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోగానీ చేరబోమంటూ ఆయన బుధవారం స్పష్టమైన ప్రకటన చేశారు. బీజేడీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ…..దేశంలోని రెండు ప్రధాన పార్టీలకు బీజేడీ దూరంగా ఉండి, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. అలానే  రైతుల సమస్యలన్నీ తీర్చుతామని 2014 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన భాజపా ఇప్పుడు అన్నదాతల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలో గౌరవ ప్రదమైన సంఖ్యలో లోక్‌సభ స్థానాలు దక్కించుకోవాలని భాజపా ప్రయత్నిస్తోంది. ఒడిశాలోని మొత్తం 21 లోక్‌సభ స్థానాల్లో 2014 ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలవగా.. కాంగ్రెస్‌ ఒక్కసీటును కూడా దక్కించుకోలేకపోయింది. 20 స్థానాల్లో బీజేడీ విజయ దుందుభి మోగించింది. అయితే 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భాజపా ఆశించదగ్గ రీతిలో విజయం సాధించడంతో ఈ సారి ఎలాగైనా బీజేడీని దెబ్బతీయాలనే యోచనతో భాజపా పావులు కదుపుతుంది.