జిన్ పింగ్ తో భేటీ కానున్న కిమ్

వాస్తవం ప్రతినిధి: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌ ప్రస్తుతం సతీసమేతంగా చైనాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 10వరకు ఆయన చైనాలో ఉంటారని ఉత్తరకొరియా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఈ నేపధ్యంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కిమ్ భేటీ కానున్నట్లు తెలుస్తుంది. గతేడాది వీరిద్దరి మధ్య మూడు సార్లు సమావేశాలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌తో కిమ్‌ చర్చలు నిర్వహించడానికి ముందు, తర్వాత ఆయన జిన్‌ పింగ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో ట్రంప్ తో రెండోసారి భేటీ అవ్వనున్నట్లు ప్రకటించిన కిమ్ ఇప్పుడు చైనా లో పర్యటిస్తూ ఉండడం గమనార్హం. సోమవారం మధ్యాహ్నం ఉత్తరకొరియా నుంచి కిమ్‌ తన భార్య, తమ దేశ అధికారులతో ప్రత్యేక రైలులో చైనా బయలుదేరారని ఆ దేశ మీడియా తెలిపింది. జనవరి 8న ఆయన పుట్టినరోజు వేడుక కూడా ఉందని చెప్పింది. జిన్‌ పింగ్‌ పంపిన ఆహ్వానం మేరకు ఆయన తమ దేశంలో పర్యటిస్తున్నట్టు చైనా మీడియా పేర్కొంది. ఉత్తరకొరియాకు చైనా ప్రధానమైన ఆర్థిక, దౌత్యపర మిత్ర దేశంగా ఉంది. ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా కిమ్‌ మాట్లాడుతూ.. తాను ట్రంప్‌ను కలవడానికి సిద్ధంగా ఉన్నానని, తమ దేశంపై ఉన్న ఆంక్షలను సడలించాలని డిమాండ్‌ చేశారు.