ఇప్పుడు అమెరికా కాదు….కెనడా, బ్రిటన్ లపై ఆసక్తి చూపుతున్నారు!

వాస్తవం ప్రతినిధి: ఒకప్పుడు భారతీయులు అమెరికా వెళ్ళడానికే ఎక్కువ మక్కువ చూపేవారు. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భాద్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయన పాలసీల కారణంగా విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే వారిలో ఎక్కువ మంది కెనడా, బ్రిటన్‌ల పట్ల ఆసక్తి చూపుతున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. భారతీయులు సహా విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్లాలనుకునే వారు కెనడా, బ్రిటన్‌లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఆ నివేదిక తెలిపింది. ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పదవిలోకి వచ్చిన తర్వాత ఆ దేశ వలస పాలసీలను, హెచ్‌1-బీ వీసా విధానాలను కఠినం చేస్తున్న నేపథ్యంలో చాలా మంది వేరే దేశాల్లో అవకాశాల కోసం చూస్తున్నారు. కెనడా సులువైన వలస‌ విధానాలతో విదేశీయులను ఆహ్వానిస్తుండటం, బ్రిటన్‌ వలసవిధానాల్లోనూ వస్తున్న మార్పుల నేపథ్యంలో విదేశీయులు ఉద్యోగాల కోసం ఈ దేశాలను ఎంపిక చేసుకుంటున్నారని నివేదిక స్పష్టంచేసింది.