భారత సంతతి పోలీస్ అధికారి రోనిల్ పై ప్రసంశలు కురిపించిన ట్రంప్

వాస్తవం ప్రతినిధి: ఇటీవల అమెరికాలోని  కాలిఫోర్నియాలో దుండగుల కాల్పులకు బలైన భారత సంతతి పోలీసు అధికారి రొనిల్‌ సింగ్‌(33)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన అమెరికా ‘నేషనల్‌ హీరో’ అంటూ ట్రంప్ పొగిడారు. ఓ అక్రమ వలసదారుడి చేతిలో విధులు నిర్విర్తిస్తున్న యువ అధికారి ప్రాణాలు కోల్పోయిన రోజున అమెరికా గుండె పగిలినంత బాధపడిందని, ఆయన అమెరికా నేషనల్ హీరో అంటూ  ట్రంప్‌ వెల్లడించారు. న్యూమన్‌ పోలీస్‌ విభాగానికి చెందిన రోనిల్‌ సింగ్‌ డిసెంబరు 26న ట్రాఫిక్‌ నియంత్రణకు సంబంధించిన విధులు నిర్వర్తిస్తుండగా అక్రమ వలదారుడు తుపాకీతో కాల్చి చంపేసి పారిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం కాలిఫోర్నియా పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ కూడా చేశారు. ఈ క్రమంలో ట్రంప్ రోనిల్ మరణం పై స్పందిస్తూ వలసదారులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడం వల్లే ఇలాంటి దారుణం జరిగిందని ట్రంప్‌ ఆరోపించారు. ఇక్కడ ఉండడానికి కూడా హక్కు లేని ఓ వ్యక్తి అమెరికా యువ అధికారి ప్రాణాలను తీశాడని ఆవేదన వ్యక్తంచేశారు. అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన వారి వల్ల ఎంతో అమూల్యమైన మన పౌరుల ప్రాణాలు పోతున్నాయని అన్నారు. అమెరికాలో పలు చోట్ల ఇలాంటి అక్రమ వలసదారుల వల్ల ఎన్నో నేరాలు జరుగుతున్నాయని, అందుకే మెక్సికోతో సరిహద్దుల్లో భద్రత కల్పించేందుకు గోడ నిర్మించాలని తాను పట్టుబడుతున్నట్లు ట్రంప్‌ చెప్పుకొచ్చారు.