ఆసీస్ చేరుకున్న ధోనీ,రోహిత్

వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్ విజయం సాధించిన భారత జట్టు వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే వన్డే జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు సిడ్నీ చేరుకున్నారు. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, యువ బౌలర్ యుజువేంద్ర చాహల్ తదితరులు తొలి వన్డేకు ఆతిథ్యమిస్తున్న సిడ్నీ నగరానికి చేరుకున్నారు.  ఈ నేపధ్యంలో రోహిత్, ధోనీతో కలిసి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరామని ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే శనివారం ఆరంభంకానుంది. టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్పీడ్‌స్టర్ బుమ్రా స్థానంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. సిరాజ్ కూడా త్వరలోనే జట్టుతో కలవనున్నాడు.