ఐదు రాష్ట్రాల్లో ఓటమి ఫలితమే ఈబీసి బిల్లు అన్న కాంగ్రెస్ నేత

వాస్తవం ప్రతినిధి: అగ్ర‌కులాల పేద‌ల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న ఈబీసీ బిల్లుపై రాజ్య‌స‌భ‌లో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ నేత ఆనంద్ శ‌ర్మ మాట్లాడుతూ…..ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ అయిదు రాష్ట్రాల్లో ఓట‌మి పాలైనందునే ఆ భయంతో ఈ బిల్లును తీసుకువ‌చ్చిన‌ట్లు ఆనంద్ శ‌ర్మ ఆరోపించారు. శ‌తాబ్ధాలుగా సామాజిక అన్యాయానికి గురైన‌వారిని అభివృద్ధి ప‌రిచేందుకే రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించార‌ని, ఆ ఉద్దేశంతోనే ఎస్సీ, ఎస్టీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు. సామాజిక న్యాయం కోసం బిల్లు తెచ్చామ‌ని బీజేపీ చెబుతున్న వాద‌న‌ల‌ను ఆయ‌న తోసిపుచ్చారు. గ‌తంలో రెండు సార్లు ఇలాంటి బిల్లును సుప్రీంకోర్టు కొట్టిపారేసింద‌న్నారు. ఈబీసీ బిల్లును ఎందుకు తెచ్చిందో స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోందని ఆనంద్ శర్మ అన్నారు. అలానే గ‌త నాలుగేళ్లుగా కోటి ప‌ది ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను కోల్పోయామ‌ని,ఉద్యోగాలే లేన‌ప్పుడు, రిజ‌ర్వేష‌న్ ఎలా క‌ల్పిస్తార‌ని ఆయ‌న ప్రశ్నించారు.