పౌరసత్వ బిల్లుకు సభలో ఆమోదం

వాస్తవం ప్రతినిధి: అత్యంత కీలకమైన పౌరసత్వ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ సవరణ బిల్లుకు సభలో ఆమోదం లభించింది.. ఈ దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించాలన్న ప్రతిపాదనను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ మొత్తానికి బిల్లుకు ఆమోదం లభించింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ర్టాలకు చెందిన పార్టీలు.. బీజేపీ మిత్రపక్షాలు కూడా ఈ బిల్లును తప్పుబట్టాయి. ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలకు విరుద్ధమైన బిల్లు అని వాదించాయి. అస్సాంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అసోం గణ పరిషద్ కూడా బిల్లును వ్యతిరేకిస్తూ కమలానికి దూరం జరిగింది. ఈ బిల్లును హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభలో ప్రవేశపెట్టగానే కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఈ బిల్లు విభజనకు, హింసకు కారణమవుతుందని తృణమూల్ కాంగ్రెస్ వాదించింది. ముస్లింలు కాకుండా ఆరు ఇతర మతాల వాళ్లకు భారత పౌరసత్వం ఇవ్వాలన్నది ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. అయితే దేశంలో ఎవరు ఆశ్రయం కోరినా ఇవ్వాలని, ఇందులో ముస్లింలను కూడా చేర్చాలని టీఎంసీ డిమాండ్ చేసింది.