ఫోన్లో సంభాషించుకున్న మోదీ, ట్రంప్

వాస్తవం ప్రతినిధి: భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ లు ఫోన్ లో సంభాషించుకున్నట్లు తెలుస్తుంది. సోమవారం సాయంత్రం వారిద్దరూ పోన్లో మాట్లాడుకొని రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, రక్షణ రంగం, ఉగ్రవాదంపై పోరాటంలో పరస్పర సహకారంపై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం మంగళవారం వెల్లడించింది. తొలుత నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకొన్న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. గతేడాది భారత్‌-అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మెరుగుపడటంపై ఇరు దేశాధినేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతేడాది రెండు దేశాల మధ్య జరిగిన 2+2 చర్చలు, భారత్‌, అమెరికా, జపాన్‌ మధ్య జరిగిన తొలి త్రైపాక్షిక సదస్సు గురించి ప్రస్తావించారు. 2019లోనూ ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడేందుకు కృషి చేయాలని మోదీ, ట్రంప్‌ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తుంది.