బంగ్లా ప్రధానిగా నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేసిన హసీనా

వాస్తవం ప్రతినిధి: బంగ్లా దేశ ప్రధాని గా షేక్ హసీనా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆవామీ లీగ్‌ పార్టీ భారీ విజయాన్ని అందుకోవడం తో ఆ పార్టీ అధినేత షేక్‌ హసీనా నాలుగో సారి బంగ్లా ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. బంగ్లా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్దుల్‌ హమీద్‌ హసీనాతో బంగాభవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 24 మంది కేబినెట్‌ మంత్రులుగా, 19 సహాయ మంత్రు లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి కేబినెట్‌లో 31 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ఆవామీ లీగ్‌తో జతకట్టిన కూటమి పార్టీలకు చెందిన మాజీ మంత్రులకు స్థానం కల్పించలేదు. ఆవామీ లీగ్‌కు చెందిన వారిని మాత్రమే మంత్రులుగా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. వరుసగా మూడుసార్లు, మొత్తంగా 4సార్లు బంగ్లాకు ప్రధానిగా ఎన్నికై హసీనా రికార్డు సృష్టించారు. 1996, 2008, 2014వ సంవత్సరాల్లో ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారు.