వాస్తవం ప్రతినిధి: అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ మోదీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామమేనని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ (జేపీ) అన్నారు. ఈ విషయమై విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మన సమాజాన్ని నిట్టనిలువుగా చీలుస్తున్న సమస్య, అన్ని వర్గాల్లో, యువతలో ఆవేశాన్ని తెస్తున్న సమస్య ఏదైనా ఉంటే అది రిజర్వేషన్ల సమస్యేనని అన్నారు.

నిరుపేదలకు రిజర్వేషన్ల ఫలితాలు కొంతైనా అందాలన్న ప్రయత్నం చేయడం మంచిదే కానీ, సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి విధించిందని అన్నారు. ఆ పరిమితి అలాగే ఉంచి, ఆ యాభై శాతంలోనే పది శాతం రిజర్వేషన్లు అగ్రవర్ణాలకు కేటాయిస్తే రాజకీయంగా, సామాజికంగా పెద్ద సంక్షోభం తలెత్తుతుందని, ఇది సాధ్యమయ్యే పని కాదని అన్నారు. మరి, యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించాలంటే సుప్రీంకోర్టు ఏమంటుందోనని అన్నారు.